మహిళా సాహితీమూర్తుల షష్టి పూర్తి కలాలకు మాతృవందనం పురస్కారాలతో సత్కారమంటే వారిని సన్మానించడం కాదు... వారి నుండి ఆశీస్సులు పొందడమేనని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్ రావు అన్నారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అయినంపూడి శ్రీలక్ష్మి నిర్వహణలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ వద్దనున్న తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. నందమూరి తారక రామారావు కళామందిరంలో మహిళా సాహిత్యమూర్తుల షష్టిపూర్తి కలాలకు మాతృవందనం పురస్కారాల ప్రదాన ఘనసత్కార కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన జవహర్లాల్ నెహ్రూ వాస్తుకళ, లలితకళల విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షు రాలు ఆచార్య కవిత దర్యానిరావు ఆచార్య తంగెడ కిషన్ రావు విశిష్ట అతిథులు రాష్ట్రపతి నిలయం మేనేజర్ డా. కె.రజనీప్రియ, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణ, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్టురమేష్, రాణి నల్లమోతు తదితరులతో కలిసి సాహితీమూర్తులైన 43 మంది మహిళామణుల షష్టిపూర్తి కలాలకు మాతృవందనం పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ పురస్కారాలు గొప్ప టానిక్ వంటివి, ఆరోగ్య ప్రదాతలని, అన్నింటికీ మించి తెలుగు విశ్వవిద్యాలయానికి, విద్యార్థులకు, సాహిత్యప్రియులందరికీ స్పూర్తిదాయ కమని అభిప్రాయపడ్డారు. భట్టు రమేష్ స్వాగతోపన్యాసంలో ఈనాటి 43 మంది మాతృవందనం పురస్కార గ్రహీతలు షష్టిపూర్తి కలాలే కాకుండా వివిధ కళారూపాల్లో నిష్ణాతులు కూడా ఉన్నారని, మహిళామూర్తుల్లోని వివిధ రకాల ప్రతిభా పాటవాలను గుర్తించి పైకితీసుకురావచ్చో ఈ మూడేళ్లలో వంద మందికి మాతృ వందనం పురస్కారాలు అందించడమే నిదర్శనమన్నారు. మామిడి హరికృష్ణ అమ్మలకు మనం ఏమిచేసినా, ఎంతచేసినా తక్కువే అని అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలో అమ్మలకు మించిన గొప్ప ప్రణాళికా రూపకర్తలుండరని, కుటుంబాన్ని ఒడిదుడుకులు లేకుండా సజావుగా నడిపిస్తూ అభ్యుదయ మార్గంలో పయనించేందుకు మూలకారకులు మార్గదర్శకులు వారేనని కొనియాడారు. మాతృవందన పురస్కార స్వీకర్తల్లో డా. పుట్టపర్తి నాగపద్మిని, డా. తిరుమల నీరజ, తెన్నేటి మాణిక్యాంబ, గౌరి తంగబేలు, ఆకెళ్ళ విశాలాక్షి, మాడభూషి లలితాదేవి, అరుణావ్యాస్, డా. రాజేశ్వరి దివాకర్ల, సత్యవాణి, ద్రోణంరాజు సుబ్బలక్ష్మి తదితరులున్నారు