సీతాస్ చారిటబుల్ ట్రస్ట్, అక్షరయాన్ (TWWF), అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్
సంయుక్త నిర్వహణలో
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్ఠాత్మకమైన మహాకవి పంపన జాతీయ పురస్కారం






మాతృభాషా దినోత్సవ వీడియో
మాతృభాషా దినోత్సవ వేడుకలు – పూర్తి వివరణ
అక్షరయాన్, తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ సంస్థ ప్రతి సంవత్సరం ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తున్న మాతృభాషా దినోత్సవ కార్యక్రమంలో మొదటి సంవత్సరం భాషా పురస్కారం పేరిట ఐఏఎస్ రమణాచారి గారికి పురస్కారం అందించింది. తదుపరి సంవత్సరాలలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీ కే శ్రీనివాసరావు గారికి, సినీ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి, తెలంగాణ రాష్ట్ర ఉ ద్యమ స్వరం శ్రీ అందెశ్రీ గారికి.. సాహితీ జన పోషకుడు విద్యాసాగర్ గారిచే వితరణ కాబడుతున్న స్వర్ణ కంకణాన్ని బహూకరించి మాతృభాషపై కృషి చేస్తున్న వారిని సత్కరించుకుంటుంది. ఈ సంవత్సరం మహాకవి పంపన జాతీయ పురస్కారాన్ని కవి, రచయిత, సాహితీ విమర్శకులు డా.మామిడి హరికృష్ణ గారు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే
అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ వారు అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ వారితో సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, మహాకవి పంపన జాతీయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం ఫిబ్రవరి 21వ తేదీన, ఉదయం 9 గంటలకు బి పి ఆర్ విఠల్ ఆడిటోరియం, (CESS) బేగంపేటలో అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు 300కు పైగా విచ్చేసిన ప్రేక్షకులతో ప్రాంగణం నిండుకుండలా మారింది.
ముందుగా తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకమైన బోనాల కోలాటాలు, డప్పులు, ఒగ్గు, డోలు విన్యాసాల వంటి వివిధ సాంస్కృతిక కళాకారులతో అతిథులకు ఆహ్వానం పలికారు. వాగ్గేయకారిణి శ్రీచందన తన అద్భుతమైన గాత్రంతో మంచి కృతులను వినిపించింది. తదువరి తెలంగాణ రాష్ట్ర నృత్యమైన పేరిణి నృత్య ప్రదర్శన జరిగింది. తదుపరి వేదిక మీదకు ముఖ్యఅతిథి, విశిష్ట అతిధులతో పాటు అతిధులందరినీ సవినయంగా ఆహ్వానించారు వ్యాఖ్యతలు డా. సమ్మెట విజయ, విశ్వైక.
కార్యక్రమంలో ప్రధమంగా మొయినాబాద్ వెంకటేశ్వర స్వామి గుడిలోని శ్రీదేవి, అండాల్ అమ్మవార్లకు అక్షరయాన్ సంస్థ, అయినంపూడి కుటుంబం వారు బంగారు మంగళ సూత్రాలను అందజేశారు. ఆనంద్ విరించి గారు పట్టు వస్త్రాలను అందించారు.
అక్షరయాన్ అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మీ గారు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహారాష్ట్ర పూర్వ గవర్నర్, శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు మాట్లాడుతూ తెలంగాణ ఆది కవి పంపన అని వేములవాడ బోధన్ ప్రాంతంలో జన్మించి కన్నడ రాజ్యం వైపు వెళ్లిపోయి విక్రమార్జున విజయంలాంటి అద్భుతమైన సాహిత్య సృష్టి చేసి తన చివరి ఘడియలన్ని తన జన్మస్థలమైన బోధన్‌లోనే గడిపిన, నిఖార్సైన నిజమైన తెలంగాణ బిడ్డ పంపన అని, అలాంటి పంపన విగ్రహాన్ని, మ్యూజియంని ట్యాంక్ బండ్ మీద ప్రతిష్టించి తెలంగాణ సాహిత్యానికి నీరాజనం అర్పించాలని పూర్వ గవర్నర్ శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు అన్నారు. పదకొండు వందల సంవత్సరాల క్రితమే విక్రమార్జున విజయం పేరిట ఒక చక్కని కావ్యాన్ని రాసిన పంపన గ్రంథాన్ని ఇప్పటివరకు ఎవరూ తెలుగులో అనువదించలేక పోయారని, తెలుగు సాహిత్య చరిత్రలో ఖాళీగా మిగిలిన ఆ శూన్యాన్ని అక్షరయాన్ వ్యవస్థాపకురాలు అయినంపూడి శ్రీలక్ష్మి చొరవతో భాషా పండితుడు ప్రముఖ సాహితీవేత్త జోస్యుల సదానంద శాస్త్రి గారు దాదాపు నాలుగేళ్ల శ్రమకోర్చి ఈ గ్రంథాన్ని తెలుగులో మనకు అందించారని, ఇది తెలుగు సాహిత్యానికి, దాని చరిత్రకు గొప్ప చేర్పు అవుతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మాతృభాషని మరచిపోతే మనుగడ ఉండదని, అలా అని ఇతర భాషలపై దురాభిమానం అక్కరలేదని ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం భాష మాతృభాష అవుతుంది కనుక అన్ని మాతృ భాషలు వర్దిల్లాలని ఆయన ఉద్బోధించారు. తెలంగాణ ప్రాంతం వందలాది సంవత్సరాల నుంచి అన్ని భాషలకు, అన్ని ప్రాంతాల వారికి నిలయంగా ఉన్న నేల అని, అందరినీ గౌరవించే విశాల హృదయం తెలంగాణ ప్రజలకు ఉందని, దానికి హైదరాబాద్ నగరమే మంచి ఉదాహరణ అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
అక్షరయాన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి మాట్లాడుతూ మాతృభూమి, మాతృదేశం, మాతృభాష ఈ మూడూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ నిత్య స్ఫూర్తి ప్రదాతలనీ, బోధన్‌లో పంపన నడయాడిన నేలలో పుట్టిన తాను తన జన్మభూమికి సాహిత్యపరంగా ఏదో చేయాలనే తపన లోంచి ఈ బృహత్గంథాన్ని అనువదింపజేయాలనే సంకల్పం ఏర్పడి నట్టు ఆమె అన్నారు.
‘విక్రమార్జున విజయం’ ప్రూఫ్ చూసిన పండితులు గణేష్ గారు, హంప నాగరాజు గారు, సుబ్రహ్మణ్యం కెందోళె గారు పాల్గొన్నారు. ఇలాంటి భాషావేత్తలతో జరిగిన సంభాషణ చర్చోప చర్చలు భాషాపరమైన వివరణలు విశ్లేషణలు అన్ని కలిపితే విక్రమార్జున విజయం అనువాద పుస్తకం కంటే పది రెట్లు ఎక్కువగా అవుతుందని అంత మేరకు మేధోమధనం జరిగిందని సదానంద శాస్త్రి గారు గుర్తు చేశారు. భావము పద్యము అర్థము తాత్పర్యముతో సహా రూపొందించిన ఈ గ్రంథం 1670 పేజీలకు విస్తరించిందని దీనిని ప్రచురించడంలో సహాయం చేసిన శాంతా వసంతా ట్రస్ట్ వరప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పుస్తక రచన ఒక ఎత్తయితే ప్రచురించడం మరొక ఎత్తు అని హంపన అన్నారు. ఈ గ్రంథ రచనలో ఎదురైన సవాళ్లను సమస్యలను అన్నింటినీ హాస్యస్ఫోరకంగా, సందర్భోచితంగా తెలుగుభాష వైభవాన్ని చాటి చెప్పేలా పద్యాల ఘటనతో చెప్పిన కన్నడ పండితుల ప్రసంగాలు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాయి.
మహాకవి పంపన జాతీయ పురస్కార గ్రహీత డా. మామిడి హరికృష్ణ గారు స్పందిస్తూ.. తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ పాత్ర అనన్య సామాన్యమైంది అని, అయితే వేర్వేరు కారణాల వల్ల తెలంగాణ సాహితీవేత్తలు చేసిన కృషి అందించినా పురోగతి అంతగా రికార్డు కాకపోవడం శోచనీయం అని దానికి ఉదాహరణే పంపన తెలంగాణ సాహిత్య చరిత్ర యుగ విభజనని పంపన ప్రాతిపదికగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో బోధన్ ప్రాంతంలో ఆయన సమాధి ఆయన సంబంధించిన శిలాశాసనాలు అన్నింటినీ పరిరక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్ రావు గారు మామిడి హరికృష్ణకు స్వర్ణ కంకణ ధారణ చేసి, మహాకవి పంపన జాతీయ పురస్కారాన్ని ఆహూతుల మధ్య అందించారు. ఆ సమయంలో కళాకారుల ఆనందోత్సాహాలు మిన్నంటాయి..
ఈ సందర్భంగా మహాకవి పంపన జాతీయ పురస్కారంతో పాటు పంపకవి పురస్కారాలు, భాషా పురస్కారాలు, స్ఫూర్తి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా “విక్రమార్జున విజయం” గ్రంధాన్ని ప్రచురణ చేయించిన శాంతా వసంత ట్రస్ట్ వారిని సత్కరించారు.
ఈ కార్యక్రమంలో పురస్కారాలు పొందినవారు
1. జోస్యుల సదానంద శాస్త్రి గారు
2. హం.ప. నాగరాజయ్య గారు
3. కె.ఆర్. గణేశ్ గారు ఆచార్యులు
4. సుబ్రహ్మణ్యం కెందోళె గారు భాషాధ్యాయి
5. కందకుర్తి యాదవ రావు గారు
భాషాసేవ విశిష్ట పురస్కారాలు
1. వసుంధర రెడ్డి గారు
2. మహిపాల్ రెడ్డి గారు రసగీతి వ్యవస్థాపకులు
3. విఠల్ జోశి కన్నడ సాహిత్య పరిషత్తు, తెలంగాణ
4. పురాణే అజయ్ కుమార్ పంపపీఠం,
బోధన్ స్ఫూర్తి పురస్కారం
1. చిలుకూరి శాంత, రామ ఉమా మహేశ్వర శర్మ
2. గడ్డం మోహన రావు, కళా పరిశోధకులు
ప్రముఖ కవి, విమర్శకులు శ్రీనాళేశ్వరం శంకరం గారిని సన్మానించుకుంటూ ఉస్తాద్ బిస్మిల్లా యువ పురస్కార గ్రహీతలు ఒగ్గు రవి, డప్పు భాస్కర్, పేరిణి రాజ్ కుమార్, పేరిణి సందీవ్, సినీ డైరెక్టర్ అక్షరని కూడా స్ఫూర్తి పురస్కారంతో సత్కరించారు.
ఈ కార్యక్రమానికి సహకారం అందించిన విశ్వం టీవీ, కోడూరి లీలావతి పద్మిని ఫౌండేషన్ వారిని, ప్రచురణ చేసిన రెయిన్బో ప్రింటర్స్ నరేంద్ర గారిని కూడా సత్కరించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సంబరాలలో భాగంగా అక్షరయాన్ తెలుగు విమెన్ రైటర్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీలక్ష్మి, అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ డా.దుంపా శ్రీదేవి, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ రాణి నల్లమోతు గార్లను ఈ సందర్భంలో భాగంగా సత్కరించారు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించటానికి విచ్చేసిన కవులు, కళాకారులకు రుచికరమైన భోజనాన్ని అందించారు నిర్వాహకులు.
తెలంగాణ్యుల అమితమైన ప్రేమాభిమానాల ఉత్సవంలో పాల్గొన్న అత్యంత మధురమైన జ్ఞాపకాలతో,
మీయొక్క ఎనలేని ఆదరణను పొందిన ధన్యతా భావముతో,
మీ మూడు సంస్థల మహిళా సమాఖ్యవారి ఉత్సాహభరిత సహకారంతో మీరు అందించిన అద్వితీయమైన నిర్వహణలోని మీ శ్రమను, కృషిని కృతజ్ఞతాభావంతో,
జరిగిన సంఘటనలను మరల మరల నెమరువేసుకుంటూ ….
ఇప్పుడు బెంగళూరుకు ప్రయాణిస్తున్నాను.
మొత్తం కార్యక్రమంలో మీయొక్క నిర్విరామమైన నిస్వార్థ సేవ, ఎవరికీ ఎక్కడా ఏ లోటూ రాకుండా ప్రతియొక్కరినీ ఆదరించాలన్న మీ తపన అంతటా కనుపించింది, సత్ఫలితాలనూ సార్థకంగా ఇచ్చింది.
మీ విశాల దృక్పథం, సేవాసంకల్పం, నిజాయితితో చేసిన అనుష్ఠానం చాల ప్రశంసనీయం! అసదృశం!!
అక్షరయాన్, అభిజ్ఞా, సీతాస్….
జయహో
సుబ్రహ్మణ్యం కెందోళె
RECENT PUBLICATIONS
అక్షరయాన్ – తెలుగు మహిళా రచయితల ఫౌండేషన్























































