చాలా కాలమైంది కదూ మిత్రమా.... ఈసారి సంక్రాంతికి మన పల్లెకు వస్తాను, మన ఊరి చివర చెరువు అలల ముఖంతో నవ్వుతూ, చేపలకు నీటి పాఠాలను బోధిస్తుందంట కదా. ఈత కొడుతూ, మనమూ నేర్చేసుకుందామా...? వేకువజామున రెక్కల చప్పుళ్లతో పలకరిస్తూ, గగనానికీ, భువనానికీ మధ్య సంచరిస్తూ, చిట్టి రెక్కల సీతాకోకలమై ఎగిరిన ఆనాటి క్షణాలను గుర్తుచేసుకుంటూ, జ్ఞాపకాల చెట్టుపై వాలిపోదామా...? ఈసారి వస్తాను, మన ఊరి హరిదాసు కీర్తనలను వినడానికి, రంగవల్లుల అందాన్ని మనసారా కనడానికి, పంటలున్నాయా...? పక్షులున్నాయా...? మన పల్లెలో పరవశించే మనసులున్నాయా...?! మిత్రమా! ఇక్కడ నగరాన ఇళ్ళకైనా, మనసుకైనా అన్నీ మూసుకున్న తలుపులే. అక్కడ మన చిన్ననాటి, వీధి అరుగు మీద తల నెరిసిన అనుభవాల తలపులే.. చాలా ఇల్లు కూలిపోయి ఉంటాయి. అయినా పర్వాలేదు కూలిన శిథిలాల్లో జ్ఞాపకాలను ఏరుకోవడానికి.... ఈసారి పల్లెకొస్తాను.... చెదిరిన మనసుతో ఓసారి వచ్చి పారేసుకున్న నా బాల్యాన్ని తిరిగి వెతుక్కుంటాను... రామాలయం ముందు భోగి మం దాని చుట్టూ పెద్దలంతా చేరి చలి కాచుకోవడానికి పడే తంటా. ఇంకా ఉన్నాయా మిత్రమా...? కనుమ రోజున కోడిపందాలు... ముక్కనుమ రోజున ప్రభల తీర్థాలు ఇంకా జరుగుతున్నాయా నేస్తమా.. కొత్తల్లుళ్లతో ఊరంతా కాంతిగానే ఉంది కదూ...! ఈసారి మాత్రం మన పల్లెను ఓసారి చూడటానికి వస్తానే... మళ్లీ తెలవారక ముందే నగరానికి వెళ్ళిపోతాను! ఎందుకంటే... నేను వెనక్కి తిరిగి చూడలేను, చూస్తే నా ఊరు కంటి చెమ్మతో నన్ను సాగనంపుతుంది.
భారతమాతాకీ జై, జై జవాన్, అన్న నినాదాల హోరుతో.. తూటానై లేచాను చితిపై