ఊరికి పోయిన యాళ్ళ
ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. సైకాలజీలో చేరిన రోజుల్లోనే తెలంగాణ భాషలో నేను కవిత్వం, కథలు రాయడం, ఇతర రచనలు చేయడం షురువయింది. అప్పటి సంది, ఏదో ఒక సందర్భంలో నేను తెలంగాణా భాషలో కవిత్వం రాస్తూనే ఉన్నా! నన్ను ఆలోచింపచేసిన, నన్ను స్పందింప చేసిన అంశాలు, సంఘటనలు, వస్తువుల మీద తెలంగాణ కవితలు ఎన్నో రాసాను. తెలంగాణ భాష, తెలంగాణ ప్రజాజీవనం ఎంత సులభంగా, సుళువుగా, సరళంగా ఉంటుందో అంతే సాదాసీదాతనం నా కవిత్వంలో ప్రతిబింబించాలనే ఉద్దేశంతో కవిత్వంలో సంక్లిష్టత (Complexity), సందిగ్ధత (Ambiguity) లేకుండా అత్యంత సరళంగా, సహజంగా రాసే శైలినే ఎన్నుకున్నాను.
తెలంగాణ భాషలో, చెప్పే విధానంలో, మాట్లాడే 'తరీఖా'లో కథనశైలి (Narrative Style) ప్రధానాంశంగా ఉంటుంది. విషయాన్ని సూటిగా చెప్పడం, సందర్భాన్ని బట్టి వివిధ భావోద్వేగాలతో చెప్పడం, ఆర్తిగా, ఉగ్రంగా, దయతో చెప్పడం, ఎవరో ఒకరిని ఉద్దేశించి చెప్తున్నట్లుగా 'సంభాషణా శైలి'తో చెప్పడం తెలంగాణా రీతి... రివాజు! ఇది తెలంగాణా కథా, కథన, కవిత్వ ఆత్మ. అందుకే నేను కూడా ఆ 'ఆత్మగల్లతనాన్ని' నా కవితలలో ప్రతిష్టించడాన్ని సహజంగా చేసాను.
తెలంగాణ భాషలో 1995 నుండి ప్రస్తుతం వరకు నేను రాసిన కవితలలో ఎంపిక చేసిన కవితలతో ఈ 'ఊరికిపోయిన యాళ్ళ'ను ప్రచురించాను. దీని ద్వారా ప్రజల భాషకు, సామాన్య ప్రజల ఆకాంక్షలకు శనార్తులు తెలియజేయడమే నా అభిలాష, ఈ కవితల ద్వారా తెలంగాణ గ్రామీణ జీవితాన్ని, దానిలోని వైవిధ్యతను, ఉద్యమ కాలపు ఉద్వేగాలను, మట్టి-మనిషి బంధాలను మొత్తంగా తెలంగాణా అస్తిత్వాన్ని, ఆత్మను తెలంగాణ భాషలోనే తెలియజేసే ప్రయత్నం చేశాను.
"మా గోసను మేము చెప్పాలే” అనే దశ నుండి "మా గోసను మా బాసలోనే చెప్పాలె” అనే తర్వాత దశలోని స్పష్టమైన తండ్లాటకు ఈ సంకలనం ఓ సంకేతం.
- డా. మామిడి హరికృష్ణ