Ontareekarana (A solitude) అక్షరం - నిత్య అసంతృప్తవాది...!
మనస్సు అనే పరమాణువులో, ఆలోచనలు అనే Orbital లో అలజడితో, అలికిడితో నిరంతరం సంతృప్త స్థితి కోసం Elliptical Shape లో పచార్లు చేస్తూనే ఉంటుంది. పరిభ్రమిస్తూనే ఉంటుంది!
పదం Unrest తో తండ్లాడే తాపసి...! ఉన్నచోట నిలవకుండా అర్థానర్థమో, అర్థరహితమో ఏదో ఒక వాక్యంగా పొదగడానికి నిత్యం సంచరిస్తూనే ఉంటుంది. వాక్యమ్ - Insecurityతో బాధపడే లోకసంచారి...! ఒక కాడ ఆగకుండా గదిగదినీ వెదుక్కుంటూ, లోకాలన్నీ కలియదిరుగుతూ నిత్య అభద్రతతో చేతనాత్మక జాగరూకతతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది.
కవిత్వం - మాత్రం ఒంటరి...!
Demographics లోని ఏకాంతవాసి...!
దాని దర్శనం మనం గుంపులో ఉన్నప్పుడు, మనలో గుంపులున్నప్పుడు సాధ్యం కాదు!
అన్ని వలువలూ, శాలువాలూ, భుజకీర్తులూ, గజమాలలూ, Crowns, Queries పరిత్యాగం చేసి నగ్న హృదయంతో మనల్ని మనం ఒలకపోసుకున్నప్పుడు, సాష్టాంగపడి వెక్కిళ్ళతో ఏడ్చినప్పుడు మాత్రమే కవిత్వం ప్రత్యక్షమవుతుంది. అలా నాకు గత దశాబ్ధాల కాలం నుంచి సాక్షాత్కారం అవుతూనే ఉంది.
Overtగానూ, Covert గానూ గుంపులో లేని వాన్ని కదా ఇంపులు, కంపులేవీ పట్టని వాన్ని కదా! అందుకే నా తెలీనితనంలోంచి నాకు కొంచెం తెలిసిందాన్ని మీతో పంచుకుందా మనుకుంటున్నా... నాకు ప్రత్యక్షమైన అక్షరానుభవంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా...
నాకు అర్థమైనంతవరకూ -
కవిత్వం ఎప్పుడైనా ఒంటరే ...
కవితా సృజనే ఒంటరీకరణ ....!
- మామిడి హరికృష్ణ